
తొలిజ్యోతి ముస్తాబాద్.21 నవంబర్ 2023.
“కాంగ్రెస్, బిజెపిలు ఆగమాగం చేస్తున్నాయి. ఆగం కాకండి.
కాంగ్రెస్ 50 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగింది? రాష్ట్రంలో 11సార్లు గెలిపించింది చాలదన్నట్లు మళ్ళీ ఒకసారి గెలిపించండి అని మోసపూరితంగా కోరుతున్నారు..జాగ్రత్త” అంటూ సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముస్తాబాద్ లో మంగళవారం జరిగిన రోడ్ షో లో ప్రసంగించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, 24 గంటల కరెంటు, ధరణి వంటివి ప్రశ్నార్థకం అవుతాయని హెచ్చరించారు. తమ హయాంలో కడుపు నిండా సంక్షేమ పథకాలు ఇవ్వనోళ్ళు ఇప్పుడు ఎలా ఇస్తారో ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఎంత అభివృద్ధి జరిగిందో మీరే చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ హయాంలో ఎట్లుండె, ఇప్పుడు ఎట్లయింది అన్నది మీ కండ్ల ముందే ఉన్నదని ప్రస్తావించారు. అభివృద్ధి అంతా సిరిసిల్లలనే అని రేవంత్ రెడ్డి కొడంగల్ లో అంటే, లోకల్ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి ఏదీ ఎక్కడ అని భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి కబుర్లు, మాయమాటలు వినవద్దని పిలుపిచ్చారు. ముస్తాబాద్ మండలంలో ఎక్కడికి వచ్చినా కరెంటు తీగలు పట్టుకొని కరెంటు ఉందో లేదో చెక్ చేసుకునే బంపర్ ఆఫర్ రేవంత్ రెడ్డి బృందానికి ఇస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. వంటి గ్యాస్ సిలిండరుపై మీపై
మోదీ మోపిన రూ.800 భారాన్ని కేసీఆర్ సర్కారు మోస్తుందని, రూ.400కే ఇస్తుందని భరోసా ఇచ్చారు.
కులం పేరిట మతం పేరిట రెచ్చగొట్టే పార్టీలను నమ్మవద్దని,
మన సిరిసిల్ల ప్రాంతంలో ముఖ్యమైన నర్మాల ప్రాజెక్టును గోదావరి జలాలతో నింపి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. ముస్తాబాద్ పెద్ద చెరువుకూ జీవకళ తెచ్చామని చెప్పారు. జిల్లా కేంద్రానికి అగ్రికల్చర్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు సాధించిన సంగతి కేటీఆర్ వివరించారు. ముస్తాబాద్ కు డిగ్రీ కళాశాల వచ్చే జనవరికల్లా మంజూరు చేస్తామని ప్రకటించారు. 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. డిసెంబర్ తర్వాత 18 ఏండ్లు దాటిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం, ఆసరా పించన్ల పెంపు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబమూ బీమా పరిధిలోకి వస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి, బిజెపికి ఓటు వేస్తే మోడీకి పోతుందంటూ, ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.